Joshua 7

1శపితమైనదాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకొన్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.

2యెహోషువ <<మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి>> అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు. 3వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చి, <<ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు>> అన్నారు.

4కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు. 5హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణద్వారం దగ్గర నుండి షేబారీము వరకు తరిమి మోరాదులో వారిని చంపేశారు.

కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి.

6యెహోషువ తన బట్టలు చింపుకొన్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకు యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ 7<<అయ్యో, ప్రభువా, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజల్ని యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా.

8ప్రభువా, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి? 9కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు>> అని ప్రార్థించారు.

10అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు, <<లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు? 11ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు. 12కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.

13నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, <రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండ నిర్మూలం చేసేవరకు మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.>

14ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరకు రావాలి. 15అప్పుడు శపితమైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్నీ అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు>>అని చెప్పాడు.

16కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదాగోత్రం పట్టుబడింది. 17యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడింది. జెరహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్ది దొరికాడు. 18అతడినీ అతని ఇంటివారినీ పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనుమడూ జబ్ది మనుమడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను దొరికాడు.

19అప్పుడు యెహోషువ ఆకానుతో, <<నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు>> అని అన్నాడు. 20అందుకు ఆకాను యెహోషువతో, <<ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. 21దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది>> అని తాను చేసిన దానిని ఒప్పుకున్నాడు.

22అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరకు పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు. 23కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసికొని యెహోషువ దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు.

24తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారుల్నీ, కుమార్తెల్నీ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.

25అప్పుడు యెహోషువ, <<నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు>> అనగానే ఇశ్రాయేలీయులంతా అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. తరువాత ఆ వస్తువులనూ రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకు ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటివరకు ఆ చోటికి <<ఆకోరు లోయ>> అని పేరు.

26

Copyright information for TelULB